
Zomato: జొమాటోకు రూ.803 కోట్ల GST పన్ను డిమాండ్ నోటిసు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ జొమాటో (Zomato)కు మరోసారి జీఎస్‌టీకి సంబంధించిన డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి.
వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ విషయం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ వివరించింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ చెల్లింపులకు సంబంధించి ఆదేశాలు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
''2019 అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31 వరకు ఉన్న కాలంలో డెలివరీ ఛార్జీలపై రూ.401.70 కోట్ల జీఎస్‌టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని మహారాష్ట్రలోని ఠాణే జీఎస్‌టీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి.అదనంగా,వడ్డీ,పెనాల్టీ రూపంలో మరో రూ.401.70 కోట్లను చెల్లించాలని ఆదేశాలు అందాయి''అని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.
వివరాలు
బిల్లులో మూడు ముఖ్యమైన అంశాలు
అయితే, ఈ విషయంలో సంబంధిత అధికారుల వద్ద అప్పీల్ చేయనున్నట్లు జొమాటో తెలియజేసింది.
జొమాటోలో (Zomato) కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.
మొదటిది ఆహార పదార్థాల ధర, రెండోది ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఈ డెలివరీ ఛార్జీ మినహాయింపు ఉంటుంది.
మూడవది ఆహారం ధరకు, ప్లాట్‌ఫామ్ ఫీజుకు సంబంధించి ఐదు శాతం పన్ను. ఈ జీఎస్టీ (GST) పన్ను 2022 జనవరి నుండి జీఎస్టీ మండలి అమలు చేస్తోంది.