
Ajith : స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రమాదం.. రేస్‌కు దూరమైన అజిత్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో నటుడిగా మాత్రమే కాకుండా,కార్ రేసింగ్‌లోనూ నిజమైన హీరోగా తల అజిత్ కుమార్ తన ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నాడు. రేసింగ్ ట్రాక్‌పై అతను చేస్తున్న అద్భుత విన్యాసాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ,వారి కళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే 50 ఏళ్లు దాటినప్పటికీ అజిత్ డ్రైవింగ్ వేగం ఏమాత్రం తగ్గలేదు.అయితే అతని అదే వేగం ఎన్నో సార్లు ప్రమాదాలకు దారితీసింది. తాజాగా ఇటలీలోని మిసానో ట్రాక్‌లో 'జీటీ4యూరోపియన్ సిరీస్' రెండవ రేస్ సందర్భంగా జరిగిన ఘటన అందుకు ఉదాహరణ. ట్రాక్‌పై ఆగి ఉన్న కారును ఢీకొనడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.అయినప్పటికీ అదృష్టవశాత్తూ అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.అయితే ఈ ఘటన కారణంగా ఆయన రేస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
వివరాలు
2010లో ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన అజిత్
ప్రస్తుతం తల అజిత్ బెల్జియంలోని ప్రముఖ 'స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్' సర్క్యూట్‌లో మూడవ రౌండ్ రేస్‌కు సిద్ధమవుతున్నాడు. మిసానో ట్రాక్‌లో జరిగిన ప్రమాదానంతరం అక్కడ పనిచేస్తున్న క్లీనింగ్ సిబ్బందికి సహాయం చేస్తూ తన వినయాన్ని మళ్లీ నిరూపించుకున్నాడు. 2003లో కార్ రేసింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజిత్, 2010లో ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో మెరిసాడు. జర్మనీ, మలేషియా వంటి దేశాల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంటూ, సినిమాలకు, రేసింగ్‌కు సమాన ప్రాధాన్యత ఇస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు, ఇటీవల భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కారం అజిత్‌కు మరొక గర్వకారణంగా నిలిచింది. తెరపై హీరో అయిన తల అజిత్ నిజజీవితంలోనూ అదే వేగాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.