
Thug Life: దేశ భద్రత ముందు వేడుకలకు బ్రేక్.. 'థగ్ లైఫ్' ఆడియో ఈవెంట్ వాయిదా!
ఈ వార్తాకథనం ఏంటి
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్' ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జూన్ 5న విడుదల కానున్న ఈ సినిమా నేపథ్యంలో ఈ నెలలోనే ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్రణాళికలు రచించారు.
మే 16న ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుందని నిర్ణయించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, 'ఇది వేడుకల సమయం కాదు' అని భావించిన మూవీ టీమ్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసింది.
ఈ విషయాన్ని కమల్‌హాసన్ స్వయంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.
Details
కీలక పాత్రలో శింబు, త్రిష
'మాతృభూమి పరిరక్షణలో సైనికులు పోరాటం చేస్తున్న ఈ సమయంలో, వేడుకలకు ఇది తగిన సమయం కాదు. మేము దేశ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తున్నాం.
సైనికులకు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందుకే మే 16న జరగాల్సిన ఆడియో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
ఈ చిత్రం 'నాయకన్' (1987) తర్వాత మళ్లీ కమల్ - మణిరత్నం కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కావడం విశేషం. గ్యాంగ్‌స్టర్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కమల్‌హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు రేపాయి.