S.P.Balasubrahmanyam : అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలు.. గాన గంధర్వుడి పేరు మీద రోడ్డు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాలం సహా 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2020లో కరోనాతో ఆయన మృతి చెందారు. కరోనా మహమ్మారి ఆయన వంటి గొప్ప వారిని తీసుకెళ్లిందని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్తుంటారు. భౌతికంగా ఆయన మధ్యలో లేకపోయినా, ప్రతి రోజూ ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఆయనకు మరింత గౌరవం కేటాయించే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.
కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు ఆయనతో ఉన్న అనుబంధం వల్ల, ఈ పేరు పెట్టడం ఆయనకు ఉన్న గౌరవమని సీఎంకు తెలియజేశారు. ఎస్పీ బాలు గారి వర్ధంతి సందర్భంగా, తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఈ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనునట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఒక గాయకుడికి ఇలాంటి గౌరవం రావడం నిజంగా గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన బాలు, భాష, ప్రాంతం చూడకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు,గౌరవం పొందారు.
50 వేల పాటలను పాడినందుకు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
అందువల్ల, ఆయనకు దక్కిన ఈ గౌరవానికి ఆయన అభిమానులు హర్షిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన బాలు, ఇంజనీరింగ్ చదివినా, సంగీతం పట్ల ఆసక్తితో సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఎస్ పి కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఎస్పీ బాలు, తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో పాడిన పాటలకు గాను దక్షిణాది రాష్ట్రాల నుంచి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులను, గుర్తింపులను కూడా పొందారు.నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు,50 వేల పాటలను పాడినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నారు.