
Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం.. 'ది షిఫ్ట్' లిస్టులో భారతదేశపు తొలి నటిగా..
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల ఆమెకు 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'గా ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమెకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత మ్యాగజైన్ 'ది షిఫ్ట్' ప్రకటించిన ప్రపంచపు ప్రభావవంతమైన మహిళల జాబితాలో దీపికా చోటు దక్కించుకుంది. వినోద రంగంలో ప్రత్యేక సేవలందించిన వ్యక్తులకు ఈ గౌరవాన్ని ప్రతి ఏడాది అందజేస్తుంటారు. ఈ క్రమంలో మోషన్ పిక్చర్స్ విభాగంలో ఈసారి దీపిక ఎంపిక కావడం విశేషమైన అంశం.
వివరాలు
మొత్తం 35 మంది ప్రముఖులు
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో హాలీవుడ్‌కు చెందిన డెమి మూర్, రాచెల్ మెక్‌ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖ నాయికలతో పాటు మొత్తం 35 మంది ప్రముఖులు ఉన్నారు. అయితే, భారత్ తరఫున ఈ గౌరవం పొందిన తొలి నటి దీపిక కావడం చరిత్రలో ఒక మైలురాయి. ఇది ఆమె వ్యక్తిగతంగా సాధించిన విజయమే కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు లభించిన గొప్ప గౌరవంగా నిలుస్తోంది. ఇక ఈ గౌరవాన్ని ఇప్పటి వరకు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర నటులు పొందకపోవడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ దీపిక ఈ గుర్తింపును అందుకున్నది, తానెంత ఉన్నత స్థాయిలో ఉన్నదో మళ్లీ ఒకసారి వెల్లడించింది.