Loading...
Dhanush: విజయ్ తర్వాత ధనుష్ వంతు.. 'తమిళగ ఎళుచ్చి కళగం'తో రాజకీయ అరంగేట్రం?
విజయ్ తర్వాత ధనుష్ వంతు.. 'తమిళగ ఎళుచ్చి కళగం'తో రాజకీయ అరంగేట్రం?

Dhanush: విజయ్ తర్వాత ధనుష్ వంతు.. 'తమిళగ ఎళుచ్చి కళగం'తో రాజకీయ అరంగేట్రం?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఎంట్రీపై చర్చ మొదలైంది. నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. ఇప్పుడు మరో స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరందుకుంది. 'తమిళగ ఎళుచ్చి కళగం'(తమిళనాడు పురోగమన పార్టీ)పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ మీడియా కథనాల ప్రకారం.. ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఆయన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ధనుష్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వివరాలు 

అభిమాన సంఘాలను బలోపేతం చేస్తున్న ధనుష్

మరోవైపు,గత కొన్ని నెలలుగా ధనుష్ తన అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అభిమాన సంఘాలను కేవలం సినీ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల తన ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేక జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీశాయి.

నటుడు విజయ్ నేతృత్వంలోని'తమిళగ వెట్రి కళగం'(టీవీకే) పార్టీ ఘన విజయం సాధించింది.

దీంతో ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలు ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి.

వివరాలు 

ఇంకా అధికారికంగా ధృవీకరించని ధనుష్ ప్రతినిధులు 

ఈ అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ధనుష్ కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ధనుష్ రాజకీయ ప్రవేశం, 'తమిళగ ఎళుచ్చి కళగం' పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందన్న వార్తలపై ఆయన నుంచి గానీ, ఆయన ప్రతినిధుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.

ప్రస్తుతం ఈ అంశం తమిళ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికే పరిమితమైంది.

ధనుష్ స్వయంగా అధికారికంగా ప్రకటించే వరకు ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ADVERTISEMENT