Page Loader
Father's Day Special: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..
ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..

Father's Day Special: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమ్మ మనల్ని తన గర్భంలో తొమ్మిది నెలలు మోస్తుంది. కానీ తండ్రి మాత్రం జీవితాంతం మనల్ని తన హృదయంలో నిలుపుకుంటాడు. మంచి-చెడులు తెలుపుతూ, సరైన మార్గంలో నడిపిస్తూ, బాధ్యతతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తాడు. అందుకే తండ్రుల ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం 'ఫాదర్స్ డే'గా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాతకాలం నుంచి తెలుగు సినిమాల్లో తండ్రి ప్రేమను, అనుబంధాన్ని చూపించిన కొన్ని ప్రముఖ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

జస్టిస్ చౌదరి 

1982లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన 'జస్టిస్ చౌదరి'లో ఎన్టీఆర్, శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకవైపు ధర్మానికి నిలబడే న్యాయమూర్తి, మరోవైపు తండ్రిపై కోపంతో పగ తీర్చుకునే మెకానిక్. తండ్రి తల్లికి అన్యాయం చేశాడనే భావనతో ఎదిగిన కొడుకు పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టారు. ఈ సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనకు రెండు నెలల తర్వాత విడుదలై, బాక్సాఫీస్ వద్ద 250 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడింది.

వివరాలు 

ఓ తండ్రి ఓ కొడుకు 

వినోద్ కుమార్, దాసరి నారాయణరావు నటించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. 1994లో విడుదలైన ఈ చిత్రంలో నదియా కథానాయికగా కనిపించారు. ఈ సినిమాలో సున్నితంగా ఫాదర్ సెంటిమెంట్‌ను అద్భుతంగా చూపించారు. జన్మనిచ్చిన తండ్రి కన్నా, పెంచిన తండ్రి ప్రేమ గొప్పదని చెప్పే ఈ కథలో తండ్రి పాత్రను గౌరవిస్తూ భావోద్వేగాల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ కాంబినేషన్‌లో ముందు వచ్చిన 'మామగారు'లోనూ మామ-అల్లుళ్ల అనుబంధం తండ్రి-కొడుకులుగా మలచబడింది.

వివరాలు 

రాయుడు

మోహన్ బాబు నటించిన ఈ కుటుంబ కథా చిత్రం 'రాయుడు'లో తండ్రి-కూతుర్ల అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఇందులో ప్రత్యూష కుమార్తె పాత్రలో, మోహన్ బాబు పెంపుడు తండ్రిగా నటించారు. కన్న కూతురు కాకపోయినా కంటిపాపలా చూసే తండ్రి ప్రేమను బలంగా ఆవిష్కరించారు. రచనా బెనర్జీ, సౌందర్య ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ హిట్ మూవీ 'వల్లల్'కి అధికారిక రీమేక్. 1998లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

వివరాలు 

సూర్యవంశం 

వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగాలను చక్కగా చెప్పింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998లో వచ్చిన ఈ సినిమాలో వెంకీ ద్విపాత్రాభినయం చేశారు. దీంట్లో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ లుగా తండ్రీ కొడుకుల పాత్రల్లో వెంకీ నటన ఆకట్టుకుంటుంది. రాధిక, మీనా, సంఘవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇది శరత్ కుమార్ నటించిన తమిళ 'సూర్యవంశం'కు రీమేక్ కాగా, తరువాత హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన వెర్షన్ కూడా పెద్ద విజయాన్ని సాధించింది.

వివరాలు 

సుస్వాగతం 

పవన్ కళ్యాణ్, దేవయాని నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇందులో తండ్రిగా రఘువరన్ పాత్రలో, కొడుక్కి అన్ని విధాలుగా మద్దతుగా నిలిచే వ్యక్తిగా కనిపించారు. ప్రేమ విషయాల్లోనూ తన కొడుకుకు స్నేహితుడిలా తోడుగా ఉండే తండ్రి పాత్ర బలంగా ఆవిష్కరించబడింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. చివర్లో తండ్రిని చివరిసారి చూడలేకపోయిన కొడుకుగా పవన్ కల్యాణ్ భావోద్వేగంతో నటించిన క్లైమాక్స్ సీన్ కన్నీళ్లు తెప్పించేది. ఇది తమిళ చిత్రం 'లవ్ టుడే'కి రీమేక్. 1998లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

వివరాలు 

డాడీ

చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. చిరు కూతురిగా చిన్నారి అనుష్క మల్హోత్రా నటించింది. తండ్రి-కూతుర్ల అనుబంధాన్ని హృద్యంగా చూపించిన ఈ సినిమా టైటిల్‌కు అనుగుణంగా భావోద్వేగాలను కదిలించేలా సాగింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. చిరంజీవి గతంలో నటించిన 'విజేత', 'రుద్రవీణ' వంటి సినిమాల్లోనూ ఫాదర్ సెంటిమెంట్‌ను ప్రభావవంతంగా చూపించారు. తండ్రి అనేది శక్తి, ఆదరణ, ప్రేమ, మార్గదర్శనం అన్నీ కలగలిసిన పాత్ర. తెలుగు సినిమాలు ఈ తండ్రి పాత్రను ఎన్నో కోణాల్లో చూపించాయి.