Taapsee Pannu: బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏడాదికే ప్రేమలో పడ్డా.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో (Mathias Boe)తో డేటింగ్ ప్రారంభించినట్లు నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) వెల్లడించారు. సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించేందుకు పెద్దగా ఆసక్తి చూపని తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన తాజా చిత్రం 'గాంధారి' (Gandhari) విజయవంతం కావడంతో పాటు 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్- 2026' అవార్డును అందుకున్న సందర్భంగా తాప్సీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, మథియాస్ బోతో తన అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వివరాలు
అది నా సొంత నిర్ణయమే
బాలీవుడ్‌లో తాను అరంగేట్రం చేసిన ఏడాదే మథియాస్ బోతో డేటింగ్ మొదలైందని తాప్సీ తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదేనని ఆమె పేర్కొన్నారు.
దేవుడు ప్రతి ఒక్కరికీ కుటుంబాన్ని ఇస్తాడని, తనకు వృత్తి కూడా అనుకోకుండా వచ్చిందని చెప్పారు. అయితే మథియాస్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం తన సొంత నిర్ణయమని స్పష్టం చేశారు.
మథియాస్‌ను ఎంచుకున్నందుకు తాను గర్వపడుతున్నానని తాప్సీ అన్నారు. తామిద్దరూ 13ఏళ్లుగా కలిసి ఉన్నామని, తమ బంధంలో ఎంతో భద్రత ఉందని వెల్లడించారు.
తమ మధ్య ప్రేమ కంటే ముందుగా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఉందని చెప్పారు.
ఒక బంధానికి పునాదిగా పరస్పర గౌరవం లేకపోతే అది ఎక్కువ కాలం కొనసాగదని తాప్సీ అభిప్రాయపడ్డారు.
వివరాలు
'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం
2024లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తాప్సీ, మథియాస్ బో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'గాంధారి' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది.
విడుదలైన తొలి మూడు వారాల్లోనే ఈ చిత్రం 18.9 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
ఈ నేపథ్యంలో తాప్సీకి 'హార్పర్స్ బజార్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ - 2026' అవార్డు లభించింది.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ.. తన తోటి నటీమణులతో పాటు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తన సినీ ప్రయాణం ఎలాంటి ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని ఆమె చెప్పారు.
వివరాలు
ప్రేక్షకులకు ధన్యవాదాలు
ప్రతేడాది తాను ఏదో ఒక అవార్డును అందుకుంటున్నానంటే అందుకు తన తోటి నటీమణులే కారణమని తాప్సీ పేర్కొన్నారు.
వాళ్లు తమ నటనతో ప్రమాణాలను పెంచకపోయి ఉంటే.. తాను మరింత ఎత్తుకు ఎదగాలని శ్రమించేదాన్ని కాదేమోనని అన్నారు.
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం, మంచి పాత్రల కోసం పోరాడుతున్న ప్రతి మహిళకూ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తాప్సీ ప్రకటించారు.
తన చుట్టూ కనిపించే సాధారణ మహిళల జీవితాలను తెరపై ప్రతిబింబించడమే తన సినీ ప్రయాణ లక్ష్యమని ఆమె తెలిపారు.
తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రేక్షకులకు కూడా తాప్సీ ధన్యవాదాలు తెలిపారు.