
Harihara Veeramallu: ఉత్తరాంధ్రలో హరిహర వీరమల్లు హవా.. ఒకే రోజు 135 థియేటర్లలో ప్రదర్శన!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన, తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల మీద కూడా సమానంగా దృష్టి సారిస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) సినిమా విడుదలకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఇక చివరకు జూలై 24న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా భారీ ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Details
వారం రోజుల పాటు 125 థియేటర్లలో ప్రదర్శన
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అరుదైన రికార్డు కూడా నమోదైంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమా విపరీతమైన స్థాయిలో విడుదల అవుతోంది. అక్కడి మొత్తం 150 థియేటర్లలో 135 థియేటర్లలో ఈ చిత్రం ఒక్కరోజే ప్రదర్శించనుంది. అంతేకాదు, వారం రోజుల పాటు 125 థియేటర్లలో ఈ సినిమా కొనసాగనుంది. ఇదంతా పవన్ సినిమా కే సాధ్యమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకే సినిమా వారం పాటు ఈ స్థాయిలో స్క్రీనింగ్ అవడం ఇదే తొలిసారి కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎనలేని ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 'హరిహర వీరమల్లు' చిత్రానికి ఇదే పెద్ద బూస్టప్ అని భావిస్తున్నారు.