
Atti Satyanarayana: 'ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు'.. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన మాజీ నేత అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల థియేటర్ల బంద్ కు సూత్రధారి అనే ఆరోపణల నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మీడియా సమావేశంలో దిల్ రాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడా థియేటర్లు బంద్ చేయాలనే వ్యాఖ్య చేయలేదని స్పష్టం చేశారు. 'ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సినిమాలు విడుదల లేకపోతే థియేటర్లు మూసివేయాల్సి రావొచ్చని మాత్రమే అన్నాను. కానీ జూన్ 1న థియేటర్లు బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని తెలిపారు. తమ్ముడిని కాపాడుకునేందుకు తనపైనే అభాండం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Details
థియోటర్ల తనిఖీల్లో అనేక లోపాలు
'పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వగానే దిల్ రాజు జనసేన పేరును ఉద్దేశపూర్వకంగా లాగారంటూ ఆయన ఆరోపించారు. కమల్ హాసన్‌ను మించేలా, ఆస్కార్ రేంజ్‌లో నటించాడంటూ దిల్ రాజుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో దిల్ రాజు అత్తి సత్యనారాయణ పేరు ప్రస్తావించడంతో జనసేనలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ వ్యవహారం మరింత ఉత్కంఠను సంతరించుకుంది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ అంశంపై విచారణ కొనసాగించాల్సిందిగా ఆయన సూచించారు. ఫలితంగా అధికార యంత్రాంగం థియేటర్లపై తనిఖీలు నిర్వహించగా, అనేక లోపాలు వెలుగుచూశాయి.