Jana Nayagan Box Office : రీమేక్ ప్రభావమేనా?.. తెలుగులో 'జన నాయకుడు' ఓపెనింగ్స్‌పై సందేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తెలుగులో ఈ సినిమాను 'జన నాయకుడు' పేరుతో విడుదల చేశారు. అయితే విడుదలకు ముందే సినిమా బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో విజయ్ సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ప్రారంభ వసూళ్లు నమోదయ్యేవి.
వివరాలు
'జన నాయకుడు' తెలుగు వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో ప్రీ-బుకింగ్స్..
కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. 'జన నాయకుడు' తెలుగు వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో ప్రీ-బుకింగ్స్ నమోదు కాకపోవడం ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి అధికారిక రీమేక్ కావడాన్ని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఈ కథను థియేటర్లతో పాటు ఓటీటీ వేదికల్లో కూడా చూసి ఉండటంతో, అదే కథను మళ్లీ థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక తమిళనాడులో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
వివరాలు
అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన..
విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తర్వాత విడుదలవుతున్న చివరి సినిమా కావడం, అభిమానుల్లో ఉన్న భావోద్వేగ అనుబంధం కారణంగా అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభించింది.
అయితే విజయ్ గత చిత్రాలతో పోలిస్తే ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ప్రీ-సేల్స్ కొంత మందగించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయ్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న 'లియో' చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.146 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది.
ఆ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.215 కోట్లకు అమ్ముడవగా, చివరకు రూ.302 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది.
వివరాలు
తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్..
అలాగే 'ది గోట్' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ సాధించింది.
ఈ సినిమా రూ.185 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, మొత్తం కలెక్షన్లు సుమారు రూ.225 కోట్ల వరకు చేరుకున్నాయి.
ప్రస్తుతం 'జన నాయగన్' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ పెట్టుబడిని రికవరీ చేసి లాభాల బాట పట్టాలంటే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ సినిమా విడుదలకు మంచి ఊపు ఇచ్చినా, తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకుల స్పందనే.