
Kollywood : హీరోగా మారుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. లోకేష్ కనగరాజ్.
హీరో సందీప్ కిషన్‌తో తెరకెక్కిన నగరం సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన లోకేష్, ఆ డెబ్యూ సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు.
ఆ తర్వాత కార్తీ ప్రధాన పాత్రలో రూపొందించిన ఖైదీ సినిమాతో ఆయన కెరీర్ దశ మారిపోయింది.
ఒక్క రాత్రిలో నడిచే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఈ విజయాలతో ఊపు మీదున్న లోకేష్, ఆ తర్వాత దళపతి విజయ్‌తో మాస్టర్ సినిమాను, కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమాను తెరకెక్కించి, స్టార్ డైరెక్టర్ల లిస్టులో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
వివరాలు
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్
ఇక తాజాగా కోలీవుడ్‌లో ఆయన గురించి ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది.
దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్ కనగరాజ్, ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడట. అవును, మీరు చదివింది నిజమే!
తాజా సమాచారం ప్రకారం,లోకేష్ కనగరాజ్ హీరోగా నటించే తమిళ చిత్రం రూపొందనుంది.
ఈ సినిమాను కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించనున్నాడట.
ప్రస్తుతం కథ చర్చలు పూర్తయ్యాయి.కోలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
వివరాలు
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కూలీ
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.
ఇక మరోవైపు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్, నటుడిగా కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.