ఖుషి మూవీ రివ్యూ: ప్రేక్షకులను విజయ్ దేవరకొండ ఖుషి చేసాడా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్, మురళీశర్మ, రోహిణి తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహెబ్ నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ కథ: విప్లవ్ దేవరకొండకు(విజయ్ దేవరకొండ) బీ.ఎస్.ఎన్.ఎల్ లో జాబ్ వస్తుంది. దాంతో కాశ్మీర్ వెళ్ళిపోతాడు. అక్కడ ఆరాధ్య(సమంత) కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. విప్లవ్ ప్రేమను మొదట్లో ఒప్పుకోని ఆరాధ్య, చివరికి అతని ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు కాబట్టి పెద్దలు వద్దని చెబుతారు. అయినా కూడా పెద్దల్ని ఎదిరించి మరీ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిందా లేదా అనేదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
ఖుషి సినిమా సాధారణ ప్రేమ కథే. ఇలాంటి కథలు తెరమీద చాలా వచ్చాయి. కానీ ఈ కథలోని నాస్తికులు, ఆస్తికులు అనే నేపథ్యం సినిమా కథను కొత్తగా మార్చేసింది. దేవుడిని నమ్మని కుటుంబం నుండి వచ్చిన విప్లవ్, దేవుడిని పూర్తిగా నమ్మే కుటుంబం నుండి వచ్చిన ఆరాధ్య మధ్య పెళ్ళయిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్ మొత్తం లవ్ సీన్లు, కామెడీ సీన్లు, అందమైన పాటలతో హాయిగా సాగిపోయింది. సెకండాఫ్ లోనే కథలో మలుపులు కనిపిస్తాయి. సెకండాఫ్ లో కొన్ని రొటీన్ సీన్లు కనిపిస్తాయి. అవి సినిమాకు అవసరం లేదేమో అనిపిస్తుంది. అయితే ప్రేక్షకుడు అలా ఫీలయ్యే లోపే క్లైమాక్స్ తో దర్శకుడు మెప్పిస్తాడు.
ఎవరెలా చేసారంటే?
విజయ్ దేవరకొండ, సమంత తమ తమ పాత్రల్లో ఇరగదీసారని చెప్పవచ్చు. వీరిద్దరి జోడీ తెరమీద అందంగా కనిపించింది. చదరంగం శ్రీనివాసరావు పాత్రలో మురళీశర్మ, నాస్తికుడు సత్యం పాత్రలో సచిన్ ఖేడ్కర్ చాలా చక్కగా నటించారు. ఇంకా రోహిణి, శరణ్య తమ పరిధి మేరకు నటించారు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కొంత నవ్విస్తే, సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణ మరికొంత నవ్వించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. సంగీతంతో సీన్లు మరింత ఎలివేట్ అయ్యాయి. నిర్మాణ విలువలకు వేలెత్తి చూపాల్సిన పనిలేదు. ఓవరాల్ గా చూసుకుంటే, అక్కడక్కడా కొంత రొటీన్ అనిపించినా ఖుషి సినిమా ప్రేక్షకులను ఖుషి చేస్తుంది.