Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారన్నారు. ఇటీవలే హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పై మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమాల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మన్సూర్ అలీఖాన్ బుద్ధి సరిగ్గా లేదని, ఆయనో వక్రబుద్ధి కలిగిన వ్యక్తిగా చిరంజీవి అభివర్ణించారు. దీనిపై స్పందించిన మన్సూర్ అలీఖాన్, వక్రబుద్ధి ఎవరిదని నిలదీస్తున్నారు. ఈ సందర్భంలోనే చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు దండుకున్నారని, వచ్చిన డబ్బంతా తన వాళ్ల కోసమే వాడుకుంటున్నారన్నారు. ప్రజలకు పంచడం లేదన్నారు.
మన్సూర్, ఏం జరిగిందో చెప్పు అని అడిగితే నేను చెప్పనా : మన్సూర్ అలీఖాన్
ఈ క్రమంలోనే చిరంజీవిపై రూ. 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై రూ. 10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇస్తానన్నారు. ఈ వివాదంలో చిరంజీవి తప్పు చేశారని, తనకు ఫోన్ చేసి 'మన్సూర్, ఏం జరిగిందో చెప్పు అని అడిగితే వివరంగా చెప్పేవాడినన్నారు. అలా తనను అడిగి తెలుసుకుని ఉండుంటే బాగుండేదని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం హీరోయిన్ త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ సర్వత్రా విమర్శలమయమైంది. దీంతో వెనక్కి తగ్గిన మన్సూర్ అలీఖాన్ త్రిషకు సారీ చెప్పారు. కానీ వివాదం మళ్లీ రేగింది. మన్సూర్ చిరుతో పాటు మిగతా హీరోయిన్లపైనా కోర్టులో పిటిషన్ వేస్తానని స్పష్టం చేశారు.