
Mohanlal పుట్టినరోజు నాడు గుడ్‌న్యూస్ చెప్పిన మోహన్ లాల్.. పుస్తకంగా జీవిత చరిత్ర..
ఈ వార్తాకథనం ఏంటి
అరవై యేళ్ల వయసులోనూ యువ కథానాయకులతో పోటీపడుతూ, బాక్సాఫీస్ వద్ద శ్రేణులు చెరిగేలా విజయం సాధిస్తున్న మలయాళ సినిమా స్టార్ మోహన్‌లాల్ తాజాగా మరో ప్రత్యేక ఘట్టానికి అంకితమయ్యారు.
తన విశేష ప్రతిభతో మలయాళ సినీ పరిశ్రమలో వరుసగా విజయాలు అందుకుంటూ, చరిత్రలో నిలిచిపోతున్న ఈ లెజెండరీ నటుడు నేడు 65వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ ప్రత్యేకమైన శుభవార్తను తెలియజేశారు. తన జీవిత కథను పుస్తకంగా తీసుకురానున్నట్లు ప్రకటించారు.
వివరాలు
జీవిత చరిత్ర పుస్తకం"ముఖరాగం"
ఈ జీవిత చరిత్ర పుస్తకానికి "ముఖరాగం" అనే పేరును మోహన్‌లాల్ ఖరారు చేశారు.
ఈ పుస్తకం గురించి వివరాలను మోహన్‌లాల్ స్వయంగా వెల్లడించారు.
"నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో కొన్ని ప్రత్యేకమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను.నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను రచయిత భానుప్రకాశ్ అద్భుతంగా అక్షరబద్ధం చేశారు. ఈ పుస్తకానికి మలయాళంలో నాకు ఎంతో ఇష్టమైన రచయిత వాసుదేవన్ నాయర్ ముందుమాట రాశారు. ఇందులో నా 47 సంవత్సరాల సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో అంశాలను ఆవిష్కరించారు. చాలామంది నా జీవితాన్ని పుస్తకంగా చూడాలని కలలు కనేవారు. ఇప్పుడు ఆ కలలు నిజమవుతున్నాయి. దాదాపు వెయ్యి పేజీలుగా ఉండే ఈ పుస్తకాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నాం" అని తెలిపారు.
వివరాలు
ఐదు సార్లు జాతీయ అవార్డులు
ఈ గ్రంధంలో మోహన్‌లాల్ నటనా జీవితం మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విశేషాలు ఉంటాయి.
ఆయన నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా, అలాగే లెఫ్టినెంట్ కల్నల్‌గా చేసిన సేవలకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారు.
అలాగే ఆయన కుటుంబ నేపథ్యం, బాల్యం, సినీ రంగంలోకి ప్రవేశం,జీవితంలో ప్రభావం చూపిన వ్యక్తుల గురించి కూడా ఈ పుస్తకంలో విశదీకరించారు.
1960లో జన్మించిన మోహన్‌లాల్ 1978లో సినీరంగంలో అడుగుపెట్టి, ప్రయోగాత్మక చిత్రాల ద్వారా స్టార్ డమ్‌ను సంపాదించారు.
తన అపూర్వమైన నటనకు గాను ఐదు సార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.
వివరాలు
అంత రిస్క్ అవసరమా?
తన కెరీర్‌పై మోహన్‌లాల్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి: "నలభై ఎనిమిదేళ్లపాటు సాగిన నా సినీ జీవితంలో, సినిమాను ఎంతగా ప్రేమించానో వేరే ఏదీ అంతగా ప్రేమించలేకపోయాను. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే, మరో నాలుగు లేదా అయిదు సినిమాలకు ఒప్పుకుంటుంటాను. ఇంట్లో వాళ్లు అప్పుడప్పుడు 'అంత రిస్క్ అవసరమా?' అని అడుగుతుంటారు. కానీ నాకైతే విశ్రాంతి తీసుకోవడం అస్సలు నచ్చదు. ఖాళీగా ఉండటం అనేది నా సహజానికి విరుద్ధం."
"చిన్నప్పటి నుంచే భారత సైన్యాన్ని గౌరవించేవాడిని. నిజంగా ఆ రంగంలోకి వెళ్ళలేకపోయినా, తెరమీదా అయినా ఆ జీవితాన్ని చూపించాలని కోరిక కలిగింది. అందుకే 'కీర్తిచక్ర', 'కురుక్షేత్ర' వంటి దేశభక్తి చిత్రాలను చేశాను."
వివరాలు
ఆ అనుభూతులు చిరస్మరణీయం
"నాకు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లపై అపార గౌరవం ఉంది. ఎన్టీఆర్ గారు నటుడిగానూ,ముఖ్యమంత్రిగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన పేదల కోసం చేసిన కృషి అపూర్వం.
అలాగే ఏఎన్నార్‌తో కలిసి 'గాండీవం' అనే చిత్రంలో నటించడం నాకు ఎనలేని గౌరవంగా అనిపించింది. ఇప్పటికీ నేను తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు చాలామంది 'గోరువంక వాలగానే గోకులానికి...' అనే పాటను గుర్తుచేసుకుంటారు."
"అప్పుడు ఏఎన్నార్, బాలకృష్ణలతో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పటికీ నా కళ్లముందు మెరుస్తుంటాయి. ఆ అనుభూతులు చిరస్మరణీయంగా నా గుండెల్లో నిలిచిపోయాయి."