Nivin Pauly: 'ప్రేమమ్' హీరోపై లైంగిక వేధింపుల కేసు.. ఖండించిన నివిన్
జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటికొచ్చాక మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరగా బయటకి వస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్ పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా హీరో నివిన్ పౌలీపై కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 3న ఓ మహిళ దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదులో అతన్ని ఆరో నిందితుడిగా చేర్చారు.
న్యాయ పోరాటం చేస్తా : నివిన్ పౌలీ
అయితే ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే నివిన్ ఆ ఆరోపణలను ఖండించారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని, ఇదంతా అవాస్తమని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉన్నందున తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. ఆమెతో ఇప్పటివరకూ మాట్లాడలేదని, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరు తనకు తెలుసునని అంగీకరించాడు. నివిన్ పౌలీతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. శ్రేయ మొదటి ముద్దాయిగా, ఆ తర్వాత నిర్మాత ఎకె సునీల్, బిను, బషీర్, కుట్టన్, నివిన్ పౌలీ ఉన్నారు.