
Chhaava in Parliament: పార్లమెంట్‌లో 'ఛావా' మూవీ స్పెషల్ స్క్రీనింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం 'ఛావా'.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్,రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా,డయానా పెంటీ,అశుతోష్ రాణా,దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ పీరియాడికల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం తొలి ప్రదర్శన నుంచే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల నుండి సినిమాకు విశేషమైన ఆదరణ లభించింది.
వివరాలు
ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి దేశవ్యాప్తంగా ఎంపీలు
తాజాగా, మార్చి 7న తెలుగు భాషలో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం మరో ప్రత్యేకమైన ఘనతను అందుకున్నట్టు సమాచారం.
ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను భారత పార్లమెంట్‌లో నిర్వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మార్చి 27న, గురువారం సాయంత్రం 6 గంటలకు 'ఛావా' ప్రత్యేక స్క్రీనింగ్ జరుగనున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంపీలు హాజరుకానుండగా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని సినిమాను వీక్షించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.