Page Loader
Pawan Kalyan:సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ 
సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan:సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినిమాహాళ్ల తాత్కాలిక బంద్ ప్రకటన, తదితర చర్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు.

వివరాలు 

'హరిహర వీరమల్లు' విషయంలో ప్రత్యేక దృష్టి 

కొత్తగా విడుదల కాబోతున్న చిత్రాల సందర్భంలో టికెట్ ధరలు పెంచాలంటే, ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలు లేదా ఇతరులు వ్యక్తిగతంగా కాకుండా, తప్పనిసరిగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలిపారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం,సంబంధిత శాఖలు నియమిత ప్రక్రియల ప్రకారం తన విధులను నిష్పక్షపాతంగా అమలు చేయాలని సూచించారు. త్వరలో విడుదలవనున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు కూడా ఇదే విధానం పాటించాల్సిందిగా తెలిపారు. నిర్మాత వ్యక్తిగతంగా కాదని, వాణిజ్య మండలే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు.

వివరాలు 

తినుబండారాల ధరలపై అధికారులు నిఘా పెట్టాలి 

సినిమాహాల్లో పాప్‌కార్న్,శీతల పానీయాలు,మంచి నీటి సీసాలు వంటి తినుబండారాల ధరలు టికెట్ కంటే ఎక్కువగా ఉండడంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉత్పత్తుల అసలైన ధరలు ఎంత? వాటిని ప్రస్తుతం ఎంతకు అమ్ముతున్నారు? అవి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. మల్టీప్లెక్స్‌లు,సింగిల్ స్క్రీన్‌లలో ఆహార పదార్థాల వ్యాపారంపై కొంతమంది గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు సినిమాలు చూడడానికి వస్తే తినుబండారాల ధరల వల్ల వెనక్కి తగ్గే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు.

వివరాలు 

జనసేన నేతల ప్రమేయంపై విచారణ 

ధరలు తగ్గితే ప్రేక్షకుల రాక పెరుగుతుందని,తద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం కూడా మెరుగవుతుందని తెలిపారు. ఈ అంశంపై పన్నుల శాఖతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. తెలుగు చిత్రరంగంలో ఇటీవల వెలువడిన సినిమా హాళ్ల బంద్ ప్రకటన,ఆ ప్రకటన తూర్పు గోదావరి జిల్లాలో మొదలైందన్న అంశం,ఇద్దరు నిర్మాతలు తమ ప్రమేయం లేదని చెప్పిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. బంద్ వెనక ఒక జనసేననాయకుడు ఉన్నారన్న విషయం మీడియాలో ఓనిర్మాత వెల్లడించగా,ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించాల్సిందిగా పవన్ కల్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్‌కు సూచించారు. బంద్ వెనక ఓ సినీ నిర్మాతతో పాటు సినిమాహాళ్లు కలిగిన ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందని తెలిపారు.

వివరాలు 

జనసేన పార్టీకి చెందినవాళ్లు ఉన్నా..

అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో అనుచిత పరిస్థితులకు దారితీసిన బంద్ ప్రకటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ కుట్రల వెనుక జనసేన పార్టీకి చెందినవాళ్లు ఉన్నా చర్యలు తీసుకోవడంలో వెనుకడగకూడదని చెప్పారు. నిర్మాతలు,నటులు,దర్శకులు బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింటుందని, అటువంటి నెగటివ్ మూడ్‌కు అవకాశం ఇవ్వకూడదన్నారు.

వివరాలు 

 త్వరలో సమగ్ర ఫిలిం డెవలప్‌మెంట్ పాలసీ 

ప్రభుత్వం సినిమా వ్యాపారం సజావుగా సాగేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న సమగ్ర ఫిలిం డెవలప్‌మెంట్ పాలసీ కోసం పరిశ్రమలోని సంఘాలు, మండళ్ల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.