Salman Khan:సల్మాన్ ఖాన్ హత్యకు పథకం.. నవీ ముంబైలో నిందితుడి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర కేసులో మరో అరెస్టు జరిగింది. హర్యానాలోని పానిపట్‌లో అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని గురువారం కోర్టు ముందు ప్రవేశపెడతామని నవీ ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న, సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో జూన్‌లో సల్మాన్‌పై మరోసారి హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు చెప్పారు. పన్వేల్ ఫామ్‌హౌస్‌కు చేరువలో ఉన్న తన ఇంటికి వెళ్తున్నప్పుడు దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.
కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ వాంగ్మూలం
కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనను, కుటుంబ సభ్యులను చంపేందుకు కాల్పులు జరిపిందని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు. "ఘటన జరిగిన రోజున నేను ఇంట్లోనే ఉన్నా. పార్టీ వల్ల ఆలస్యం కావడంతో ఆలస్యంగా పడుకున్నా. ఉదయం నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా బయట ఎవరూ కన్పించలేదు" అని ఆయన తెలిపారు.
హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్
ఈ కేసు దర్యాప్తులో ఒళ్లు జలదరించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నవీ ముంబయి పోలీసులు 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు. సల్మాన్‌ను హత్య చేయాలన్న గ్యాంగ్‌ది పక్కా ప్లానింగ్ కావడంతో, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుట్రను అమలుచేయడానికి మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు గ్యాంగ్ ఏర్పాట్లు చేసింది. సల్మాన్ సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్ ఫామ్‌హౌస్‌కు వెళ్ళే సమయంలో ఈ కుట్రను అమలుచేయాలనుకున్నారు. ఇక హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.