Page Loader
Preity Zinta: ₹18 కోట్ల రుణ మాఫీ ఆరోపణలను ఖండించిన ప్రీతి జింటా 
₹18 కోట్ల రుణ మాఫీ ఆరోపణలను ఖండించిన ప్రీతి జింటా

Preity Zinta: ₹18 కోట్ల రుణ మాఫీ ఆరోపణలను ఖండించిన ప్రీతి జింటా 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta)కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్‌ (మాజీగా ట్విట్టర్‌) ఖాతాలో పోస్టు చేస్తూ, ప్రీతి జింటా తన సామాజిక మాధ్యమ ఖాతాలను భాజపాకు అప్పగించినందున, న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఆమె తీసుకున్న రూ.18కోట్ల రుణం మాఫీ అయ్యిందని ఆరోపించింది. అలాగే, ఇటీవల బ్యాంకును మూసివేయడంతో డిపాజిటర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది. ఈ ఆరోపణలపై ప్రీతి జింటా మండిపడుతూ, తాను తన సోషల్ మీడియా ఖాతాలను స్వయంగా నిర్వహిస్తానని,ఎవరికీ అప్పగించలేదని స్పష్టం చేశారు. అలాగే తన పేరు ఉపయోగించి అసత్య వార్తలు ప్రచారం చేయడం తగదని,ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

వివరాలు 

అపార్థాలు చోటుచేసుకోకుండా ఉండాలని స్పందిస్తున్న: ప్రీతి 

"కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పోస్టును చూసి నేను ఆశ్చర్యపోయాను. నా కోసం ఎవ్వరూ రుణ మాఫీ చేయలేదు. రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకుని అసత్య ప్రచారం చేయడం బాధించేదిగా ఉంది. పదేళ్ల క్రితం ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా, దానిని పూర్తిగా తిరిగి చెల్లించాను. అసలు విషయాన్ని తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి అపార్థాలు చోటుచేసుకోకుండా ఉండాలని భావించి, నేను స్పందిస్తున్నాను" అని ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలో వివరణ ఇచ్చారు.

వివరాలు 

ముంబయి పోలీసుల కస్టడీలో హితేష్ మెహతా

ఇక, ముంబైలోని న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌ జనరల్ మేనేజర్ హితేష్ మెహతా,బ్యాంకు నుంచి రూ.122 కోట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక అక్రమాల కేసులో ప్రస్తుతం ఆయన ముంబయి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రీతి జింటా చేసిన ట్వీట్