
L2 Empuraan: 'ఎల్2:ఎంపురాన్' వివాదంపై స్పందించిన పృథ్వీరాజ్ సుకుమారన్
ఈ వార్తాకథనం ఏంటి
భారీ అంచనాలతో విడుదలైన 'ఎల్2: ఎంపురాన్' ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ఈ అంశంపై ఇప్పటికే మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ విషయంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు.
తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని, తప్పుడు కథనాలు చూసి బాధపడ్డానని ఆమె తెలిపారు. ఈ విషయంలో అసలు నిజాలు వెల్లడించేందుకు సోషల్ మీడియాలో సుదీర్ఘంగా పోస్ట్ పెట్టారు.
వివరాలు
మోహన్‌లాల్ నాకు బాగా తెలిసిన వ్యక్తి
" 'ఎల్2: ఎంపురాన్' చిత్రానికి సంబంధించి తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. పృథ్వీరాజ్‌పై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. అసత్య కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఓ తల్లిగా ఇవి నా మనసుకు బాధ కలిగిస్తున్నాయి. మోహన్‌లాల్ గారూ, చిత్ర నిర్మాతలు ఎవరూ నా కుమారుడిని మోసం చేశాడని పేర్కొనలేదు. మోహన్‌లాల్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. మా కుటుంబానికి ఆయన సన్నిహితుడు. పృథ్వీరాజ్‌ను ఆయన ఎన్నోసార్లు ప్రశంసించారు. అయితే, ఇప్పుడు కొందరు నా కుమారుడిని తప్పుడు ఆరోపణలతో బలిపశువును చేయాలని చూస్తున్నారు. కానీ, అతను ఎవరినీ మోసం చేయలేదు, ఎప్పటికీ చేయడు'' అని మల్లిక తెలిపారు.
వివరాలు
మోహన్ లాల్ కూడా ఈ సినిమాను పూర్తిగా చూశారు
"ఈ సినిమా తయారీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే, అందులో భాగమైన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ప్రతీ ఒక్కరూ స్క్రిప్ట్‌ను ముందుగా చదివారు. చిత్రీకరణ సమయంలో ప్రతి అంశాన్ని అంగీకరించి ముందుకు సాగారు. రచయిత కూడా ఎప్పుడూ చిత్రబృందంతో ఉన్నారు, అవసరమైన మార్పులు చేయడం సాధారణమే. కానీ ఇప్పుడు, సినిమా విడుదలైన తర్వాత, పృథ్వీరాజ్ ఒక్కరే దానికి బాధ్యత వహించాల్సినట్టు చేయడం తగదు. మోహన్‌లాల్ గారికి తెలియకుండా కొన్ని సన్నివేశాలు జోడించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన కూడా ఈ సినిమాను పూర్తిగా చూశారు. నా కుమారుడు ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేడు, ఆయన నైతికతకు వ్యతిరేకంగా ఎవరినీ బాధపెట్టే ప్రయత్నం చేయడు'' అని ఆమె వివరించారు.
వివరాలు
మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు
'ఎల్2: ఎంపురాన్' పృథ్వీరాజ్ దర్శకత్వంలో, మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం.
మార్చి 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
అయితే, కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు సమాచారం.