Pushpa 2 : 'పుష్ప 2' టికెట్ ధరలు భారీగా పెంపు?.. ప్రభుత్వంతో మైత్రి మూవీ మేకర్స్ చర్చలు!
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం పుష్ప ది రూల్. అల్లు అర్జున్ నటనతో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే కాక, ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ విజయం సాధించే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రేజ్ కారణంగా ఏపీలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి భాగం పుష్ప భారీ సెన్సేషన్ సాధించడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం మీద ఉన్న క్రేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ నటన దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైప్ పెంచాయి.
రూ.300 వరకు పెంచే ఆలోచన
అందుకే ఈ చిత్రానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ టికెట్ ధరలు పెంచడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. పుష్ప 2 కోసం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు సాధారణంగా రూ. 150-200 మధ్య ఉండగా, వాటిని 300 రూపాయల వరకు పెంచే ప్రతిపాదన అందుబాటులో ఉంది. గతంలో పుష్ప 1 విషయంలో సరైన మద్దతు లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. అందుకే, ఈసారి మంచి రేటు పొందేందుకు మైత్రి నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరల పెంపు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏపీ సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.