Rajamouli-Mahesh Babu: జనవరిలో సెట్స్ మీదకు రాజమౌళి-మహేష్‌బాబు ప్రాజెక్ట్!
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రాజమౌళి, తన తదుపరి ప్రాజెక్ట్‌గా మహేష్‌తో చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. మహేష్‌బాబు పుట్టినరోజైన ఆగస్ట్ 9న ఈ సినిమాకు సంబంధించి, అప్డేట్ ఉంటుందని చాలా మంది ఎదురు చూసినా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్
ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ, ప్రీప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యమవడంతో షూటింగ్ షెడ్యూల్‌ని మరికొద్దిగా వాయిదా వేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పూజా కార్యక్రమాలు ఈ ఏడాది చివర్లో, వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంతో రూపొందనుండటమే కాకుండా, ఇందులో హాలీవుడ్ నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.