Rajinikanth: అక్టోబర్ 15న షూటింగ్‌లో అడుగుపెట్టనున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని గురువారం రాత్రి 'ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో చిత్ర బృందం నిర్లక్ష్యం వహించిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ మేరకు దీనిపై 'కూలీ' చిత్రం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ఆ వార్తలను ఖండిస్తూ, అవన్నీ నిరాధారమైనవని లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రజనీకాంత్ వైజాగ్ షెడ్యూల్ సమయంలో సర్జరీ అవసరం ముందే ఉందని చెప్పారన్నారు.
షూటింగ్ కన్నా రజనీకాంత్ ఆరోగ్యమే ముఖ్యం
ఇక సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశామని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం కంటే తమకు షూటింగ్ ముఖ్యం కాదని, కావున నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. అక్టోబర్ 15న రజనీకాంత్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని లోకేశ్ వెల్లడించారు. రజనీకాంత్ నటిస్తున్న 171వ చిత్రంగా 'కూలీ' రూపొందుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ దేవా పాత్రలో కనిపిస్తుండగా, నాగార్జున సైమన్‌గా నటిస్తున్నారు. ఇక ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో భాగమయ్యారు.