Rana Daggubati: వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా: నటుడు రానా
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో వినోద రంగం (ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ) అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమతో పాటు క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి రానా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, క్రియేటర్ ఎకానమీ, వైజాగ్‌లో సినీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
వివరాలు
ఆ తరహా మ్యాజిక్ ఏపీలోనూ జరగాలి: రానా
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమగా ఎదిగిందని రానా అన్నారు.
ఇదే తరహా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధ్యమవ్వాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ సహకారం లభిస్తే రాష్ట్రంలో వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రియేటర్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని తీసుకురావడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
ప్రస్తుతం యువత చేతిలో ఉన్న ప్రతి మొబైల్ ఫోన్ ఒక ప్రొడక్షన్ డివైజ్‌గా మారిందని రానా పేర్కొన్నారు.
యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వస్తున్న యువ ఫిల్మ్ మేకర్స్.. పెద్ద స్టూడియోల కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తున్నారని వివరించారు.
ఇలాంటి కొత్త తరం పారిశ్రామికవేత్తలు,సృజనకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ఈ కొత్త మార్పునకు విశాఖపట్నం వేదిక కావాలని ఆకాంక్షించారు.
వివరాలు
సినిమా నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు
దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి అనుగుణంగా ఎలాంటి వ్యవస్థను నిర్మించారో, అదే తరహా ఎకో సిస్టమ్‌ను వైజాగ్‌లోనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సినిమా నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సాహకాలు అందిస్తోందని వెల్లడించారు.
రానున్న రోజుల్లో క్రియేటర్ ఎకానమీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇంట్లో కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.