ఆర్ఆర్ఆర్: అరుదైన అవార్డును అందించిన అమెరికా వైబ్ సైట్
రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్, తన అవార్డుల పంటను ఇప్పుడప్పుడే ఆపేలా కనిపించట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో వరుసపెట్టి అవార్డులను అందుకుంటూనే ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అందుకుంది. అలాగే ఆస్కార్ నామినేషన్లో చోటు దక్కించుకుంది. భారతదేశ సినిమా అభిమానులంతా ఆస్కార్ ప్రధానోత్సవం మార్చ్ 12వ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపుల్లో ఉండగానే ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన అవార్డ్ దక్కింది. అమెరికాకు చెందిన రోట్టెన్ టొమాటోస్ అనే వెబ్ సైట్, ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ అందించింది. అభిమానులకు అమితంగా ఆకట్టుకున్న చిత్రంగా ఫ్యాన్స్ ఫేవరేట్ ఫిలిమ్ క్యాటగిరీలో అవార్డు గెలుచుకుంది ఆర్ఆర్ఆర్. ఈ విషయాన్ని రోట్టెన్ టోమాటోస్ అధికారికంగా ప్రకటించింది.
ఆస్కార్ అవార్డ్ ఊరిస్తుండగా హాలీవుడ్ యాక్టర్ల ప్రశంసలు
ఆర్ఆర్ఆర్ సినిమాకు అమెరికాలో వరుసగా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. అక్కడి జనాలను ఆర్ఆర్ఆర్ అమితంగా ఆకర్షించింది. చైనీస్ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు 98సెకన్లలో అమ్ముడవడం, నాటు నాటు పాటకు థియేటర్లోని జనాలంతా డాన్సులు చేయడం, మొదలగునవి ఆర్ఆర్ఆర్ పట్ల అమెరికా జనాలా ఆసక్తిని తెలియజేస్తున్నాయి. నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రకారం, టాప్ గన్ మ్యావరిక్ హీరోయిన్ మోనికా బార్బరో, నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను తన ఫ్రెండ్స్ తో పాటు చూసానని, చాలా ఎంజాయ్ చేసానని, కాకపోతే తెలుగు వెర్షన్ లో సినిమాను చూడాలనుందని తెలిపింది. ఈ ప్రశంసలన్నీ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.