Saipallavi: చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఉత్తమ నటిగా సాయిపల్లవి, ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఇందులో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో 'అమరన్' చిత్రంలో ఉత్తమ నటిగా సాయి పల్లవి, 'మహారాజ' చిత్రంలో ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు. ఈ విజయం పై సాయిపల్లవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి కూడా అవార్డు పొందినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ''మహారాజ్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు'' అన్నారు.
ఆయన భార్య వల్లే ఈ అవార్డు: సాయి పల్లవి
సాయిపల్లవి మాట్లాడుతూ, ''22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు పొందడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు విడుదలయ్యాయి. వాటికి తీవ్రమైన పోటీ ఉండింది. అలాంటి కాలంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం నాకు గర్వంగా ఉంది.నా అభిమానులకు చాలా థాంక్స్.వారి ప్రేమ నాకు చాలా భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ముకుంద్ కుటుంబం, ఆయన భార్య వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈ కథను ప్రపంచానికి తెలియజేయడానికి వారు అంగీకరించారు, అందుకే ఈ సినిమా రూపొందించగలిగాం. ఇది దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక జవాను కథ. రాజ్‌కుమార్ పెరియాసామి వంటి దర్శకులు ఇలాంటి మరెన్నో కథలను మనం చూడగలుగుతాం'' అని పేర్కొన్నారు.