Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ మీద సీఎం కీలక వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగ్గా, ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించారు. డిసెంబర్ 2న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం నుంచి దరఖాస్తు వచ్చింది. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో, హీరోయిన్, నిర్మాతలతో పాటు చిత్రబృందం థియేటర్‌కు వస్తుందని, బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. చిక్కడపల్లి సీఐ ఆ దరఖాస్తును తిరస్కరించారు. థియేటర్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉండటం వల్ల భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమని, అందువల్ల సెలబ్రిటీలు రావడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. పోలీసులు అనుమతిని నిరాకరించినా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారన్నారు.
ఈ ఘటనపై విచారణ సాగుతోంది
ఆయన కారు రూఫ్‌టాప్ పైకి ఎక్కి అభిమానులను అభివాదం చేస్తుండగా, చుట్టుపక్కల థియేటర్ల నుంచి అభిమానులు బారులుగా తరలివచ్చారన్నారు. దీంతో థియేటర్ గేటు తెరవడంతో అదే సమయంలో అనేక మంది థియేటర్ లోపలికి వెళ్లారన్నారు. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. సంధ్య థియేటర్ ఘటన అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుందని అనుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న దశలో ఉన్నందున అధికంగా వ్యాఖ్యానించడం దర్యాప్తు అధికారులకు ఇబ్బందిగా మారుతుందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారని, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో బయటపడే అవకాశం ఉందన్నారు.