Loading...
Movies: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్‌.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్‌.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

Movies: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్‌.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్‌ 1, 2026 నుంచి తమిళంలో కొత్త సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ చిత్ర నిర్మాతల సంఘం ప్రకటించింది. ఆగస్టు 22న తమిళ చిత్ర నిర్మాతల సంఘం, ప్రస్తుత తమిళ చిత్ర నిర్మాతల సంఘం సంయుక్తంగా నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తమిళనాడు ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌, తమిళనాడు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ తీసుకున్న నిర్ణయంపై నిర్మాతల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

వివరాలు

8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల..

సెప్టెంబర్‌ 1 నుంచి తమిళనాడులోని థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను.. నిర్మాతలు థియేట్రికల్‌ రిలీజ్‌ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని లేఖ ఇస్తేనే ప్రదర్శించేందుకు అనుమతిస్తామని ఆయా సంఘాలు నిర్ణయించాయి.

అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో లేకపోయినా.. కేవలం తమిళనాడులో మాత్రమే ఏకపక్షంగా ఈ కొత్త నిబంధనను తీసుకురావడం సరైంది కాదని నిర్మాతల సంఘం పేర్కొంది.

ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నిర్మాతలను కూడా సంప్రదించి చర్చించాలని, ఎవరికీ నష్టం కలగకుండా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

తమను సంప్రదించకుండా డిస్ట్రిబ్యూటర్ల సంఘాల సమాఖ్య, తమిళనాడు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది.

వివరాలు

థియేటర్లలో కొత్త సినిమాల విడుదల ఉండదని ప్రకటన..

ప్రతి ఏడాది 250కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయని నిర్మాతల సంఘం తెలిపింది.

అయితే వాటిలో చాలా సినిమాలకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదని పేర్కొంది.

దీంతో తమిళ సినీ పరిశ్రమలో ఏటా రూ.700 కోట్లకు పైగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని వెల్లడించింది.

ఇంతటి ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ నిర్మాతలు ఇప్పటికీ సినిమాలు నిర్మిస్తున్నారని సంఘం తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతలందరి తరఫున తమిళ చిత్ర నిర్మాతల సంఘం సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సెప్టెంబర్‌ 1, 2026 నుంచి తమిళ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో కొత్త సినిమాల విడుదల ఉండదని ప్రకటించింది.

ADVERTISEMENT

వివరాలు

సినిమా పనులు నిలిపివేస్తామని వెల్లడి..

అంతేకాకుండా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సహా అన్ని సినిమా పనులను కూడా నిలిపివేస్తామని వెల్లడించింది.

ఈ సమస్యను తమిళనాడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు నిర్మాతల సంఘం తెలిపింది.

తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరనున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT