
Vijay: రాజకీయ సునామీ సృష్టిస్తున్న దళపతి విజయ్.. మధురై సభకు రికార్డు స్థాయిలో హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం (TVK)' రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణను సొంతం చేసుకుంటోంది. విజయ్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తుండగా, ఇటీవల మధురైలో జరిగిన రెండవ రాష్ట్ర స్థాయి సమావేశం మాత్రం రికార్డులను తిరగరాసింది. ఆ సభకు రికార్డు స్థాయిలో ఒక కోటి 40 లక్షల మంది (14 మిలియన్లు) హాజరైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంచనాలను మించి ఈ స్థాయిలో ప్రజలు హాజరుకావడం తమిళనాడు రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
Details
సెల్ఫీ వీడియో 10.3 మిలియన్ల లైక్స్
ఇక సభ సందర్భంగా విజయ్ తీసుకున్న సెల్ఫీ వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, దానికి 10.3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. దక్షిణ భారత నటులలో ఒకరికి చెందిన పోస్ట్‌పై ఇంత భారీ స్థాయిలో లైక్స్ రావడం ఇదే మొదటిసారి. దీంతోపాటు విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ కూడా క్షణాల్లో పెరిగి కోటిన్నర (15 మిలియన్లు) దాటింది. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా "జన నాయకన్" షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటనకు గుడ్‌బై చెప్పి, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సినీ అభిమానులు రాజకీయ మద్దతుదారులుగా మారుతుండటంతో, విజయ్‌కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
అత్యంత వేగంగా ఎదుగుతున్న రాజకీయ నాయకుడిగా విజయ్
అయితే విజయ్ మీటింగులకు వచ్చే భారీ జనసందోహం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. సభ ప్రాంగణాల వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు చెమటోడుస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం తమిళనాడులో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాజకీయ నాయకుడిగా విజయ్‌ను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 2026 ఎన్నికల్లో ఈ అభిమానాన్ని ఓట్లుగా మలచగలడా? లేక అభిమాన తుఫాన్ రాజకీయాల్లో అదే స్థాయిలో కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.