LOADING...
Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే?
దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే?

Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్‌' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆరంభం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మూవీకి కర్ణాటక రాష్ట్రంలో విడుదల ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో ఆగిపోవడం చర్చనీయాంశమైంది. ఫలితంగా సినిమా ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమైంది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉన్నా.. రిలీజ్ అయిన మొదటి రోజే నెగెటివ్ టాక్‌ బయటకు వచ్చింది. కలెక్షన్లు ఆశించిన స్థాయికి చేరకపోవడమే కాదు, పూర్తిగా నిరాశజనకంగా నిలిచాయి.

Details

ఫస్ట్ డే వసూళ్లు కేవలం రూ.15.5 కోట్లు

ఫస్ట్ డే వసూళ్లు కేవలం రూ.15.5 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. కమల్ హాసన్ గత సినిమాల రికార్డులతో పోల్చితే ఇది అత్యంత తక్కువగా చెప్పవచ్చు. రెండో రోజుకు కలెక్షన్లు మరింత పతనమవుతూ రూ.7.15 కోట్లకు పరిమితమయ్యాయి. మూడో రోజు అయితే రూ.5.84 కోట్లకే పరిమితమైంది. మొత్తం మూడు రోజుల కలెక్షన్లు కలిపితే కేవలం రూ.28 కోట్లు మాత్రమే వచ్చాయి. వీకెండ్‌లో సాధారణంగా వసూళ్లు పెరిగే అవకాశం ఉండగా.. 'థగ్ లైఫ్‌' విషయంలో అది ఎదురవ్వలేదు. సోమవారం నుండి కలెక్షన్లు మరింత క్షీణించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Details

నష్టపోయిన నిర్మాతలు

ఈ సినిమా ద్వారా మణిరత్నంతో కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడంతో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే రొటీన్ కథనశైలి, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉండగా, కమల్ హాసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ప్రస్తుత వసూళ్లను చూసి సినిమా దాని సగం కూడా రాబట్టే పరిస్థితిలో లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారీ అంచనాల నడుమ వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా కమల్ హాసన్ కెరీర్‌లో మరో ఘోర అపజయంగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.