Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్ వివాదం.. పార్తిబన్ క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను చేసిన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై నటుడు, దర్శకుడు పార్తిబన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఆ కార్యక్రమంలో తనను పరిచయం చేసుకునే సమయంలో ఆయన కులానికి సంబంధించిన పదాన్ని ప్రస్తావించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన పార్తిబన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
వివరాలు
పొరపాటున నోరుజారాను : పార్తిబన్
పోస్టులో ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకునే వ్యక్తిని అని అన్నారు. నిజం చెప్పాలంటే తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదన్నారు. కులవ్యవస్థను విమర్శిస్తూ తాను ఎన్నో సినిమాలు చేశానని, అలాంటిది తాను కావాలనే ఆ విషయాన్ని ప్రస్తావించడం అసాధ్యమని అన్నారు. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటు అని, ప్రసంగం మధ్యలో మాట జారిపోయిందని అన్నారు. తన ఇన్నేళ్ల అనుభవంలో కులం గురించి అలా మాట్లాడటం ఇదే మొదటిసారి అని, ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానని తెలిపారు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుందని అభిప్రాయపడుతున్నారు.