Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్ వెల్లడించారు. 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్స్‌తో పాటు తొలి రోజు కలెక్షన్స్‌ను కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. కెరీర్‌లో మంచి ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో 'కొరియన్ కనకరాజు' కూడా చేరిందని మేకర్స్ తెలిపారు.
వివరాలు
కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్..
విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
టీజర్, ట్రైలర్‌తో పాటు వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ చేసిన వరుస ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ రూపంలో మంచి స్పందన లభించింది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండలో చెక్కభజన బృందాన్ని నడిపించే కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు.
వివరాలు
కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ..
తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి సరదాగా జీవితాన్ని గడిపే కనకరాజు.. చైత్ర (రితిక నాయక్)ను చూసి ప్రేమలో పడతాడు.
అయితే ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే స్థిరపడాలనేది చైత్ర కల. ఈ క్రమంలో అనూహ్యంగా కనకరాజులోకి ఓ కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది.
ఆ తర్వాత కనకరాజు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?
ఆ కొరియన్ ఆత్మ కారణంగా అతడు కొరియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఆ ఆత్మ కనకరాజును వదిలి వెళ్లిందా? అనే ఆసక్తికర అంశాలతో సినిమా కథ సాగుతుంది.
మొత్తంగా తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ అందుకున్న 'కొరియన్ కనకరాజు'.. రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.