Manchu Vishnu: విల్‌స్మిత్-మంచు విష్ణు కలయిక.. తరంగ వెంచర్స్ ద్వారా కొత్త ప్రయాణం!
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, విద్యా రంగ నిర్వాహకుడిగా పలు రంగాల్లో ప్రతిభను చాటిన మంచు విష్ణు, తాజాగా టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. తరంగ వెంచర్స్ పేరిట 50 మిలియన్ డాలర్ల నిధులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మీడియా, వినోదం, సాంకేతికత రంగాలను సమూలంగా మార్చే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ భాగస్వామిగా చేరే అవకాశం ఉందని మంచు విష్ణు ప్రకటించారు. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే మంచి వార్త రానుందని చెప్పారు. తరంగ వెంచర్స్ వివిధ విభాగాల్లో సాంకేతికత ఆధారిత సేవలను అందించనుంది. ఓటిటి, యానిమేషన్, గేమింగ్ వంటి వినోద ప్రపంచానికి విప్లవాత్మక మార్పులను తీసుకురావడం.
ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్
బ్లాక్ చెయిన్, ఏఆర్, వీఆర్, ఏఐ లాంటి ఆధునిక సాంకేతికతలపై దృష్టి సారించనుంది. స్టార్టప్స్‌కు వ్యూహాత్మక ప్రణాళికలు, ఆర్థిక మద్దతు అందించడంలో కీలకంగా వ్యవహరించనుంది. తరంగ వెంచర్స్‌లో విష్ణుతో పాటు ఆది శ్రీ, ప్రద్యుమన్ ఝాలా, వినయ్ మహేశ్వరి, విల్ స్మిత్, దేవేష్ చావ్లా, సతీష్ కటారియా వంటి ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. భారత్ నుంచి డెలవర్ వరకు పలువురు కొత్త పెట్టుబడిదారులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతలతో క్రియేటివిటీకి ప్రోత్సాహం ఇవ్వడం తమ లక్ష్యమని మంచు విష్ణు చెప్పారు. ప్రస్తుతం మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.