ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది. 31.02 హెక్టార్ల విస్తీర్ణంలోని వన్యప్రాణులు రక్షిత అటవీ ప్రాంతంలో మంటలు సంభవించాయి. అడవి మంటల కారణంగా రూ.4,80,000 నష్టం వాటిల్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గర్వాల్‌లో రూ. 3.66 లక్షలు, కుమావోన్‌లో రూ. 1 లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే 40సార్లు మంటలు
గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లో ఈ సంవత్సరం 40సార్లు మంటలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో వన్యప్రాణులు డజనుకు పైగా మరణించినట్లు అటవీశాఖ డేటా వెల్లడించింది. ఫిబ్రవరిలో నమోదైన అధిక ఉష్ణోగ్రత కారణంగానే అగ్ని ప్రమాదాలు పెరిగాయి. సాధారణంగా, ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయి. జూన్ మధ్యలో రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు ఉంటాయి. నేలపై ఎండు ఆకులు పుష్కలంగా ఉండటంతో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంటలు వ్యాప్తిస్తాయి. అయితే ఈ కార్చిచ్చు వల్ల సమీపంలోని గ్రామస్తులకు, అటవీశాఖ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీశాఖ నివేదిక చెబుతోంది.