ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి
మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 48గంటల్లో 16 మంది కొత్తగా జన్మించిన శిశువులు, 15 మంది పేషెంట్లు మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల 48 గంటల్లో 31 మంది చనిపోయారు. ఆస్పత్రిలో మెడిసిన్లు మాత్రమే కాదు నర్సులు, ఇంకా ఇతర సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారట. ఈ క్రమంలో ఇప్పటివరకు సరైన వైద్యం అందక 16మంది శిశువులు, 15మంది పేషెంట్లు (పాము కాటు కరిచిన వాళ్ళు, ఇతర రోగాలతో బాధపడుతున్న వారు) చనిపోయారు.
బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడారు. ఇప్పుడు చనిపోయిన 24మంది మాత్రమే కాదు మరొక 70 మంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని అన్నారు. చాలామంది నర్సులను నాందేడ్ ప్రభుత్వాసుపత్రి నుండి ట్రాన్స్ఫర్ చేశారని, వైద్య సంబంధ పరికరాలు పనిచేయడం లేదని 500 పడకల ఆసుపత్రిలో 1200మంది వరకు పేషెంట్స్ ఉన్నారని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఆస్పత్రిలో చిన్నారులు చనిపోవడం హృదయ విదారకమని, ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టే బీజేపీ.. ఆస్పత్రిలో సౌకర్యాలకు ఖర్చుపెట్టలేకపోతుందని మండిపడ్డారు.