LOADING...
SLBC tunnel Collapse: ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు
ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు

SLBC tunnel Collapse: ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ఉద్ధృతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా,వారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. 13రోజులుగా మూడు షిఫ్టుల్లో 24గంటల పాటు సహాయక చర్యలు నిర్వహించినప్పటికీ, కార్మికుల లభ్యతపై స్పష్టత లేదు. అనుమానిత ప్రాంతాల్లో వేగంగా తవ్వకాలు జరుగుతున్నాయి. టీబీఎం మిషన్‌పై పేరుకుపోయిన బురదను తొలగించేందుకు వాటర్‌ గన్స్‌ను ఉపయోగిస్తున్నారు. అదనంగా,రోబోల వినియోగాన్ని కూడా పరీక్షిస్తున్నారు.ఇక,కొన్ని రోజుల కష్టానికి ఫలితంగా పునరుద్ధరించిన కన్వేయర్‌ బెల్టు మళ్లీ తెగిపోవడంతో సహాయక చర్యలకు మరో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్‌ ద్వారా తరలిస్తున్నారు. అయితే, సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట తగ్గకపోవడంతో డ్రిల్లింగ్‌ పనులు ముందుకు సాగడం కష్టంగా మారింది.

వివరాలు 

జీపీఆర్‌ టెక్నాలజీ ద్వారా మానవ అవశేషాలు 

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జీపీఆర్‌ టెక్నాలజీ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి తదితర వ్యర్థాలను తొలగిస్తున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారు స్వతంత్రంగా పనిచేస్తుండటంతో రక్షణ చర్యల పురోగతి మందగిస్తోంది. ఈ గతి కొనసాగితే, మరో 10 రోజులైనా కార్మికులను బయటికి తీసుకురావడం కష్టమని అంచనా వేస్తున్నారు. లోకో ట్రైన్‌ 13.5 కిలోమీటర్ల మేరకు వెళ్లే అవకాశం ఉండటంతో, మట్టి, రాళ్లతో పాటు కట్‌ చేసిన టీబీఎం మెషిన్‌ విడిభాగాలను కూడా బయటకు తరలిస్తున్నారు.

వివరాలు 

నీటి ఊట ప్రధాన అడ్డంకి

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను సందర్శించిన తర్వాత అధికారుల ఉత్సాహం తగ్గినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడం మరింత కష్టతరంగా మారింది. టన్నెల్‌లో దుర్వాసన వ్యాపించడంతో సహాయక సిబ్బంది పని చేయడం కష్టంగా మారింది. పేరుకుపోయిన మట్టి,శిథిలాలతో పాటు,నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. రెస్క్యూ బృందాలు ఒక అడుగు ముందుకు వేస్తే, రెండు అడుగులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గత నెల 22వ తేదీ నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నస్తున్నా, ఇప్పటికీ వారి ఆనవాళ్లు లభించలేదు. సొరంగం కూలిన ప్రదేశంలో భూకంప సూచనలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది.