Cyclone Dana: గంటకు 15 కి.మీ 'దానా' ముందుకు.. రేపటికి తీరం దాటే అవకాశం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను రేపటికి తీవ్రంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరాన్ని దాటనుంది. ఈ తుపాను పూరీ (ఒడిషా) మరియు సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో తుపాను గంటకు 15 కి.మీ వేగంతో కదులుతుండగా, ప్రస్తుతం పరదీప్ (ఒడిషా)కి 520 కి.మీ, సాగర్ ద్వీపానికి 600 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
దీని ప్రభావంగా నేటి మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో గంటకు 80-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో, బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా ఉండొచ్చని, అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణాంకి కూర్మనాథ్ సూచించారు.