Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, నీతి ఆయోగ్‌కు చెందిన సలహాదారులు, డైరెక్టర్లు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ జరిగింది. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి 'స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047' రూపొందించామని సీఎం చంద్రబాబు వివరించారు.
వ్యవసాయం, అక్వా రంగాలపై ప్రత్యేక దృష్టి
ఈ ప్రణాళిక రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో అమలు చేశామన్నారు. వ్యవసాయం, అక్వా తదితర రంగాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పేదరిక నిర్మూలన, జీవన సౌకర్యాలు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తూ, వృద్ధిరేటు సాధించడానికి ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.