జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన నవ యువ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తుదిశ్వాస విడిచారు.
ఈ మేరకు మంగళవారం బాధిత కుటుంబీకులకు సైన్యం నుంచి సమాచారం అందింది. పాములపాడు మండలం మద్దూరు పంచాయతీలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సిరిగిరి సురేంద్ర 2019లో సైన్యంలో చేరారు.
బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ 3 రోజుల క్రితం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినట్లు సైన్యాధికారుల నుంచి సమాచారం అందినట్లు కుటంబసభ్యులు వెల్లడించారు.
జవాన్ పార్థివదేహం బుధవారం మద్ధూరుకు చేరే అవకాశం ఉంది. సెప్టెంబరులో ఇంటికి వస్తానని 3 రోజుల క్రితం తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్యలతో సురేంద్ర చెప్పినట్లు సమాచారం.
Details
4 నెలల క్రితమే సెలవులపై స్వగ్రామానికి వచ్చిన సురేంద్ర
కుమారుడి రాక కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న అమ్మనాన్నలకు, కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది.
మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం బారాముల్లా RR బెటాలియన్ యూనిట్ నెంబర్ 46లో పని చేస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల ఆపరేషన్‌లో పాల్గొని వీరమరణం పొందారు.
సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కాగా అమ్మాయికి వివాహం జరిపించారు. ఊర్లో ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటూ ఇద్దరు కుమారులను విద్యావంతులను చేశారు.
పెద్ద కుమారుడు సుమన్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. చిన్న కుమారుడు సురేంద్ర 4 నెలల క్రితమే సెలవులపై స్వగ్రానికి వచ్చారు.