Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం!
ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు యూపీ పోలీసులతో జరిగిన కాల్పులలో మరణించారు. వారు అనుమానాస్పద వస్తువులతో పురానాపుర్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఉగ్రవాదులు పంజాబ్ సరిహద్దుల్లోని పోలీసు పోస్టులపై గ్రనేడ్ దాడులకు పాల్పడిన నిందితులుగా గుర్తించబడ్డారు. ఇటీవల, వారి ఆచూకీ యూపీ రాష్ట్రంలోని పీలీభీత్ జిల్లాలో కనుగొనబడింది, దీంతో యూపీ, పంజాబ్ పోలీసులు అప్రమత్తమై, సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం
పురానాపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరగడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితులు గుర్వీందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్‌లను ఆసుపత్రికి తరలించి చికిత్స ఇచ్చారు, కానీ చికిత్స పొందుతూ వారు మృతిచెందారని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి ఏకే రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతు పొందిన ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ సభ్యులని పంజాబ్ పోలీసులు తెలియజేశారు.