Telangana: ఏడాదిలో 321 కంపెనీలు.. 25,277 మందికి ఉద్యోగావకాశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పది నెలల కాలంలో, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులు అందాయి. టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం వెల్లడించిన నివేదిక ప్రకారం, మొత్తం 321 కంపెనీలు తెలంగాణలో రూ.7,108 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటి ద్వారా 25,277 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన కోసం 566.53 ఎకరాల భూమిని టీజీఐఐసీ కేటాయించింది.
తెలంగాణలో పెట్టుబడులపై దృష్టి
రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటనల కారణంగా, తెలంగాణలో పెట్టుబడుల రాకలో పెరుగుదల కనిపించింది. దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలోని పర్యటనల సమయంలో వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పెట్టుబడులు తెలంగాణ వైపు మొగ్గుచూపాయి. నివేదికలో కొన్ని ప్రధాన భూకేటాయింపులను వివరించారు. - ఇండోనేషియా సంస్థ మయూర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో రూ.158.80 కోట్ల పెట్టుబడి పెట్టి, 866 మందికి ఉద్యోగాలను ఇవ్వనుంది.
అమృతాంజన్ హెల్త్ కేర్ ద్వారా 142 మందికి ఉద్యోగాలు
- లోహం మెటీరియల్స్ ప్రై. లిమిటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో రూ.502 కోట్ల పెట్టుబడులతో 414 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్ రూ.125.04 కోట్ల పెట్టుబడితో 142 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ భూకేటాయింపులు, పెట్టుబడులు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఒక పెద్ద ముందడుగని నివేదికలో పేర్కొంది.