
Cloudburst: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదలు.. నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ మరోసారి క్లౌడ్‌బస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు ఉధృతమయ్యాయి. ఈ విపత్తులో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. పది ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఆగస్టు 27 వరకు జమ్మూ డివిజన్‌లోని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశముందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవలి రోజుల్లో కథువా, కిష్త్వార్ జిల్లాల్లో జరిగిన క్లౌడ్‌బస్ట్‌లో ఇప్పటికే ప్రాణనష్టం సంభవించింది. ఆ దుర్ఘటన మరువక ముందే మరోసారి భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి.
వివరాలు
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యేకంగా కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జమ్మూ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే సాధ్యమైనంతవరకు ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వివరాలు
ప్రమాద ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ బృందాలు సిద్ధం
వరదల ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం,రాళ్లు జారిపడడం జరుగుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దోడా జిల్లాలోని ఒక ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మరోవైపు తావి నది ఉప్పొంగిప్రవహిస్తోంది. అనేక వాగులు, నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రాత్రి సమయాల్లో నీటి స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రమాద ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
వివరాలు
గత వారాంతంలో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం
ఇక గత వారాంతంలో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం 24 గంటల్లోనే 190.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. గత వందేళ్లలో ఆగస్టు నెలలో ఇది రెండవ అతిపెద్ద వర్షపాతం. 1926 ఆగస్టు 5న 228.6 మిల్లీమీటర్లు అత్యధికంగా నమోదైంది. రెండవ స్థానంలో 2022 ఆగస్టు 11న కురిసిన 189.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది. అయితే తాజాగా కురిసిన 190.4 మిల్లీమీటర్ల వర్షం ఆ రికార్డులను అధిగమించి మరోసారి చరిత్ర సృష్టించింది.