Page Loader
BSE Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్‌
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్‌

BSE Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు.. నాలుగు ఆర్డీఎక్స్‌ ఐఈడీ బాంబులు అమర్చినట్లు మెయిల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాంబులు పేలే అవకాశం ఉందని,''కామ్రేడ్ పినరయి విజయన్‌'' పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు

ఇక దేశ రాజధాని దిల్లీలోని కొన్ని కళాశాలలు కూడా బాంబు బెదిరింపులతో తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. దిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను భద్రంగా బయటకు పంపించి, బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్ బృందాలతో భద్రతా పరిశీలన కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలువురు అధికారుల నివాసాలు, ఆస్పత్రులు, కళాశాలలకు ఇటీవలి కాలంలో ఇలా నకిలీ బాంబు బెదిరింపులు వస్తుండటంపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు.