MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్ర ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో వెల్లడించింది.
28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.
ఎన్నికల సందర్భంగా నేతలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించబడింది.
మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, 24 మంది శాసనసభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో వాటిని విశ్లేషించలేకపోయామని ADR తెలిపింది.
క్రిమినల్ కేసుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలలో 138 మంది (79 శాతం) ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో
కేరళ (69%), తెలంగాణ (69%), బిహార్ (66%), మహారాష్ట్ర (65%), తమిళనాడు (59%) రాష్ట్రాల్లోనూ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలపై నేర అభియోగాలు ఉన్నాయి.
తీవ్ర నేరాల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 98 మంది (56 శాతం) ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి.
తెలంగాణలో 50 శాతం, బిహార్‌లో 49 శాతం, ఒడిశాలో 45 శాతం, ఝార్ఖండ్‌లో 45 శాతం ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.
పార్టీ లెవల్‌లో చూస్తే, బీజేపీకి చెందిన 1,653 మంది ఎమ్మెల్యేలలో 638 (39 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
వీరిలో 436 మంది (29 శాతం)పై తీవ్రమైన నేరాలు ఉన్నాయి.
వివరాలు
టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులు
కాంగ్రెస్‌కు చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 (52 శాతం)మందిపై క్రిమినల్ కేసులు ఉండగా,194 (30 శాతం) మందిపై తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయి.
టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులు,82 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.
డీఎంకే పార్టీకి చెందిన 132 ఎమ్మెల్యేలలో 98 (74 శాతం) మందిపై క్రిమినల్ కేసులు,42 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 230 ఎమ్మెల్యేలలో 95 (41 శాతం) మందిపై క్రిమినల్ కేసులు,78 మందిపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) చెందిన 123 ఎమ్మెల్యేలలో 69 (56 శాతం)మందిపై క్రిమినల్ కేసులు,35 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు ADR నివేదికలో వెల్లడించింది.