JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు
జమిలి ఎన్నికల బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలు, తీర్మానంపై ఓటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సాధారణ మెజారిటీని అందించాయి. అయితే ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉండటంతో వాటి ఆమోదానికి 3/2 మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో బిల్లుపై మరింత సమగ్ర చర్చలు జరపాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లు ప్రకటించింది. జేపీసీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షించనున్నారు. స్పీకర్ రాబోయే 48 గంటల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే శుక్రవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈలోగా జేపీసీ సభ్యులను ప్రకటించకపోతే, జమిలి ఎన్నికల బిల్లులను తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు.
90 రోజుల గడువు అవసరం
జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉంటారు. వారిలో 21 మంది ఎంపీలను లోక్‌సభ నుంచి, 10 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి నియమించనున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఎంపీల పేర్లను అందించాలని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సూచించింది. స్పీకర్ సభ్యుల ప్రకటన త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా బిల్లుపై చర్చలు ముందుకు సాగతాయి. జేపీసీ బిల్లుపై సమగ్ర చర్చలు పూర్తి చేయడానికి సాధారణంగా 90 రోజుల గడువు కల్పిస్తారు. అవసరమైతే ఈ గడువును పొడిగించే వీలుంది. ఈ కమిటీ చర్చల అనంతరం బిల్లుపై తుది నివేదికను సమర్పిస్తుంది.
బిల్లు కొత్తగా ప్రవేశపెట్టే ఛాన్స్
తద్వారా లోక్‌సభ, రాజ్యసభలు మరింత స్పష్టతతో నిర్ణయం తీసుకోవచ్చు. జమిలి ఎన్నికల బిల్లుపై చర్చలకు జేపీసీ అత్యంత ప్రాధాన్యంగా మారింది. పార్లమెంట్‌లో ప్రధాన పార్టీలు తమ ప్రతినిధుల ఎంపికలో వేగంగా వ్యవహరిస్తేనే బిల్లుపై చర్చలు సమయానికి ప్రారంభమవుతాయి. ఒకవేళ ప్రక్రియ ఆలస్యం అయితే, బిల్లును కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.