
Pakistan: ఆపరేషన్ సిందూర్ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ పటిష్టంగా కొనసాగుతున్న తరుణంలో, పాకిస్థాన్ భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.
ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అధికారికంగా ధ్రువీకరించింది.
మే 8న సుమారు 45 నుంచి 50 మంది వరకు ఉన్న ఉగ్రవాదుల సమూహాన్ని సరిహద్దులు దాటి భారతదేశంలోకి చొరబడేలా పాక్ బలగాలు యత్నించాయని వెల్లడించారు.
ఈ ప్రయత్నాన్ని గట్టిగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో పాక్ బలగాలు భారీగా షెల్లింగ్‌కు పాల్పడ్డాయి.
వివరాలు
45-50 మంది వరకు ఉగ్రవాదులు
ఈ ఘటనపై బీఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ మండ్ ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ''పాక్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దులను దాటి రానున్నారన్న సమాచారం మాకు ముందుగానే లభించింది.మా సైనికులు అప్రమత్తంగా ఉండి, వారిని ముందే గుర్తించి తీవ్రస్థాయిలో ఎదురుదాడులు నిర్వహించారు.ఆ సమూహంలో 45-50 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారు. వారు భారత భూభాగం వైపు చేరుకోగానే, మేము వారిపై దాడి ప్రారంభించాము,'' అని తెలిపారు.
మేము ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా బీఎస్‌ఎఫ్ జవాన్లు అత్యంత ఖచ్చితంగా, సమర్థంగా కాల్పులు జరిపారు.
దీనివల్ల పాక్ ఉగ్రవాదులు తాము ఆక్రమించిన స్థావరాలను వదిలేసి వెనక్కి వెళ్లిపోయారు.
వివరాలు
బీఎస్‌ఎఫ్ దాడుల్లో పాక్ బంకర్లు, ఆయుధ నిల్వలు ధ్వంసం
ఈ ఎదురుదాడి దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. బీఎస్‌ఎఫ్ దాడుల్లో పాక్ బంకర్లు, ఆయుధ నిల్వలు ధ్వంసమయ్యాయి.
''వారు మరోసారి ఇలాంటివే చేయడానికి ప్రయత్నిస్తే, మేము పదింతల బలంతో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి బీఎస్‌ఎఫ్‌కి స్పష్టమైన ఆదేశాలున్నాయి. మహిళా జవాన్లు కూడా మగ జవాన్లతో సమానంగా పోరాట క్షేత్రంలో భాగంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారిని చూసి మాకు గర్వంగా ఉంది,'' అని డీఐజీ ఎస్‌ఎస్ మండ్ అన్నారు.
ఇక బుధవారం రోజు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌ను కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ సందర్శించారు.
ఆయన ఆర్మీ, బీఎస్‌ఎఫ్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వివరాలు
ఏడుగురు ఉగ్రవాదులు మృతి
అలాగే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో కూడా చొరబాటుకు చేసిన పాక్ ఉగ్రవాదుల ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది.
మే 8 రాత్రి 11 గంటల సమయంలో, అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని బీఎస్‌ఎఫ్ తెలిపింది.
ఈ ఎన్‌కౌంటర్లో కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.