Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ను వీడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ భారీ మొత్తంలో ఆఫర్ చేస్తోందన్నారు. ట్విట్టర్(ఎక్స్) ద్వారా సంచలన విషయాలను వెల్లడించారు. బీజేపీ నాయకులు ఇటీవల తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తామని ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు చెప్పినట్లు వివరించారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు, ఇతరులతో కూడా చర్చలు జరుపుతున్నామని, దిల్లీ సర్కార్‌ను కూల్చేస్తామని బీజేపీ నాయకులు అన్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వివరించారు.
బీజేపీ ఆఫర్‌ను మా ఎమ్మెల్యేలు తిరస్కరించారు: కేజ్రీవాల్
అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.25కోట్ల చొప్పున ఆఫర్ చేశారని, అంతేకాకుండా బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేయిస్తామని హామీ కూడా ఇచ్చారని కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే బీజేపీ నాయకులు 21 మంది తమ ఎమ్మెల్యేలను సంప్రదించామని చెబుతున్నప్పటికీ... తమకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటి వరకు కేవలం 7 మంది ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారన్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించారన్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ జరిపేందుకు తనను అరెస్టు అరెస్టు చేయడం లేదని.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లుగా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అవి సఫలం కాలేదన్నారు.