గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం
ఇనుప ఖనిజ తవ్వకాల రారాజు, కర్ణాటక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసుల్లో జనార్దన్ సహా ఆయన భార్య గాలి లక్ష్మీ అరుణకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 82 ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జనార్దన్ రెడ్డిపై ఉన్న కేసులు తేలేదాకా సదరు ఆస్తులు జప్తులోనే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఒక దశలో 124 ఆస్తుల జప్తు చేయాల్సి ఉందని, ఇందుకు అనుమతివ్వాలని సీబీఐ, కోర్టును కోరింది. విచారణ తర్వాత 82 ఆస్తులను జప్తు చేయాలని స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దేవుడి ఆశీస్సులతోనే కేసుల నుంచి విముక్తి : గాలి
కోర్టు జప్తు చేసిన ఆస్తుల్లో సుమారు 77 ఆస్తులు గాలి పేరిట ఉండగా మరో 5 ఆస్తులు ఆయన భార్య పేరున ఉండటం గమనార్హం. కోర్టు ఆదేశాలపై స్పందించిన గాలి జనార్దన్ రెడ్డి, దేవుడి ఆశీస్సులతో త్వరలోనే కేసుల నుంచి బయటపడగలననే విశ్వాసం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కేసుల్లో బెయిల్ పై వచ్చాక జనార్దన్ బెంగళూరు దాటి పెద్దగా బయటకు వెళ్లలేదు. బళ్లారికి వెళ్లకూడదని గాలికి ప్రత్యేక కోర్టు షరతులు పెట్టింది. కల్యాణ రాజ్య ప్రగతిపక్ష పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన గాలి, తాజా కన్నడనాట ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారంతా ఓటమిపాలు కాగా గాలి మాత్రమే ఏకైక ఎమ్మెల్యేగా సంచలన విజయం నమోదు చేయడం కొసమెరుపు.