Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక
ఈ వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల ఆంధ్రప్రదేశ్'లో 983 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 840 టీఎంసీలను నింపారు. జలాశయాలను నింపడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ జలవనరుల శాఖ అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా బుధవారం, జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితి, నీటి నిల్వ, భూగర్భజలాల మెరుగుదల, నీటి నిల్వ పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించారు. ప్రధాన జలాశయాల పరిస్థితి ప్రధాన రిజర్వాయర్లలో తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి, ఏలేరు జలాశయాల్లో మొత్తం 709.53 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అందులో 695.93 టీఎంసీలు నిల్వ చేయగలిగారు.
భూగర్భజలాల మెరుగుదల
భూగర్భజలాలు గత పదేళ్లలో మెరుగయ్యాయని అధికారులు తెలిపారు. వర్షాకాలానికి ముందు, భూగర్భజలాలు సగటున 11.71 మీటర్ల లోతులో ఉండేవి..వానలు పడ్డాక, ఇది సగటున 9.02 మీటర్ల మేర పెరిగింది. ఈ ఏడాది వర్షాకాలానికి ముందు 11.81 మీటర్ల వద్ద ఉన్న భూగర్భజలాలు, సెప్టెంబర్ నాటికి 8.51 మీటర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం 278 టీఎంసీల భూగర్భజలాలను వాడుకోవడానికి అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
గ్రామాల పరిస్థితి
రాష్ట్రంలో 830 గ్రామాలు పూర్తిగా ఎడారిగా మారినట్లు తెలిసింది. భూగర్భజలాలు దారుణ పరిస్థితిలో ఉన్న 450 గ్రామాలు, దారుణ పరిస్థితులకు చేరువలో ఉన్న 1,271 పల్లెలు గుర్తించగా.. ప్రస్తుతం, భూగర్భజలాల రక్షణాత్మక స్థితిలో ఉన్న గ్రామాలు 14,020 ఉన్నాయి. చెరువులకు జలకళ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలు బాపట్ల వరకు 15 జిల్లాల్లో 24,487 చెరువుల్లో 65 శాతం నీటితో కళకళలాడుతున్నాయి. పల్నాడు నుంచి ప్రారంభించి సీమ జిల్లాల్లో 13,957 చెరువులు ఉన్నట్లు గుర్తించబడ్డాయి, కానీ అక్కడ 28.2 శాతం మాత్రమే నింపబడింది.